అసని ఎఫెక్ట్.. ఏపీలో నేటి ఇంటర్ పరీక్ష వాయిదా
AP Inter 1st Year exams on May 11 postponed due to cyclone Asani.బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ ఎఫెక్ట్
By తోట వంశీ కుమార్ Published on 11 May 2022 8:22 AM ISTబంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతన్న ఇంటర్ పరీక్షలపై పడింది. తుఫాన్ ప్రభావంతో నేడు(బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. నేడు జరగాల్సిన పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అసని తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బోర్డు నిర్ణయం మేరకు నేడు జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్-1ఏ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం వాయిదా పడ్డాయి. మిగతా పరీక్షలు ఇంటర్ బోర్డు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి.
ఇదిలా ఉంటే.. అసని తుఫాన్ దిశ మార్చుకుంది. తొలుత ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుఫాను దిశ మార్చుకుని మచిలీపట్నం వైపు దూసుకువెలుతోంది. బుధవారం సాయంత్రానికి మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల మేరకు.. గత ఆరు గంటలుగా గంటకు 12 కి.మీ వేగంతొ అసని కదులుతోంది. నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి తుఫాను రానుంది. కాకినాడ వద్ద మళ్లీ సముద్రంలోకి వచ్చి బలహీన పడే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది.
తుఫాన్ ప్రభావం వల్ల కాకినాడ, గంగవరం, భీముని పట్నం పోర్టులకు 10 వనెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగతా పోర్టులకు ఎనిమిదో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణ, పశ్చిమ గోదావరి, గుంటూర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. విశాఖ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేయడంతో పాలు, విశాఖకు వచ్చే విమానాలను రద్దు చేశారు.