ఫైళ్లు దగ్ధం చేయగలరేమో, నిజాల్ని చెరపలేరు..మదనపల్లి ఘటనపై ఏపీ హోంమంత్రి వార్నింగ్
మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
By Knakam Karthik Published on 12 March 2025 5:45 PM IST
ఫైళ్లు దగ్ధం చేయగలరేమో, నిజాల్ని చెరపలేరు..మదనపల్లి ఘటనపై ఏపీ హోంమంత్రి వార్నింగ్
మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సబ్ కలెక్టక్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి కీలక ఫైళ్లను దగ్ధం చేసిన కేసులో ఇప్పటికే ఆర్డీవో మురళీ, కొత్త ఆర్డీవో హరిప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌పై ప్రాథమిక విచారణ అనంతరం సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ నేతృత్వంలో వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. శాసనమండలిలో ఎమ్మెల్సీలు తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్ బాబు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి బదులిచ్చారు.
ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజ్ సహా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులైన పీఏ తుకారం, మాధవ్ రెడ్డి తదితరులను ఏ1, ఏ2, ఏ3గా పేర్కొంటూ విచారణ జరుగుతుందన్నారు. పాత ఆర్డీవో మురళీ నేతృత్వంలో అసైన్డ్ ల్యాండ్ 79,107 ఎకరాలను ఫ్రీ హోల్డ్ కింద 22ఏ రికార్డుల నుంచి బయటకి విడుదల చేసినట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ స్థాయిలో పునర్విచారణ నేపథ్యంలో 22,523 ఎకరాల భూమి విషయంలో నిబంధనలు అతిక్రమించినట్లు తేలిందన్నారు. దీనిపై ప్రాథమిక నివేదిక వచ్చిందని అధికారిక నివేదిక కూడా రావాల్సి ఉందన్నారు. అగ్ని ప్రమాదం వెనుక దాగి ఉన్న అసలు కుట్రలను కూటమి ప్రభుత్వం బయటపెట్టడం జరిగిందన్నారు. అక్రమంగా భూమిని ఆక్రమించాలనుకుని నిబంధనలను అతిక్రమించిన పెద్దిరెడ్డి అండ్ కో కుట్ర వల్లే అగ్నిప్రమాదం జరిగిందన్నారు. మదనపల్లి ఆర్డీవో ఆఫీస్ లో ఫైళ్లను దగ్ధం చేయగలరేమోగానీ నిజాల్ని చెరపలేరని హోంమంత్రి అన్నారు. తప్పు చేసిన వారిని, అందుకు సహకరించిన వారిని వదలబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి పేర్కొన్నారు.
మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో పెద్దిరెడ్డి అనుచరుల హస్తం...సీఐడీ దర్యాప్తు పూర్తి కాగానే చర్యలు తప్పవు#MadanapalliFiles #legislativeCouncil #AndhraPradesh #ChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #VangalapudiAnitha #HomeMinisterAnitha #VangalapudiAnithaArmy pic.twitter.com/BWID8mSOvh
— Anitha Vangalapudi (@Anitha_TDP) March 12, 2025