విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు

AP highcourt notice to union government on jd lakshmi narayana petition.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్రాంత ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 4:07 PM IST
AP HC

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్రాంత ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీన చేసిన హైకోర్టు.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కు అనే నినాదంతో ఏర్ప‌డిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయొద్దంటూ ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఉద్య‌మాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్నా.. కార్మిక సంఘాలు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా ఉద్య‌మాలు చేస్తూనే ఉన్నాయి. వివిధ వర్గాల నుంచి కార్మికుల‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. కార్మికుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా నిలిచిన ల‌క్ష్మీనారాయ‌ణ.. విశాఖ ఉక్కును న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో వివ‌రిస్తూ ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే లేఖ కూడా రాశారు. అంతేకాదు, అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలో ఉపయోగించిన ఉక్కును, ముంబయి-నాగ్ పూర్ హైవే నిర్మాణంలో ఉపయోగించిన ఉక్కును విశాఖ స్టీల్ ప్లాంటే ఉత్పత్తి చేసిందని వివరించారు. ఆయన ఎప్పటికప్పుడు కార్మిక సంఘాలతో మాట్లాడుతూ కార్యాచరణను ముందుకు తీసుకెళుతున్నారు.

కార్మిక సంఘాలు ఉద్య‌మాలు చేస్తున్నా.. కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా అడుగులు వేస్తుండ‌డంతో.. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్‌లో ఆయన కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని, ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని లక్ష్మీనారాయణ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.



Next Story