ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసి గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్ఈసీ తరుపు న్యాయవాది వాదనలు వినిపించగా.. కొవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితం వాదనలు ముగియయగా.. జడ్జిమెంట్‌ను రిజర్వ్ చేసిన హైకోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు.. ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించింది. ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చేసింది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా.. నాలుగు దశల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం.