టీటీడీ ప్ర‌త్యేక ఆహ్వానితుల నియామ‌క జీవోపై హైకోర్టు స్టే

AP High court Suspends TTD GO on special invitees.తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sept 2021 12:46 PM IST
టీటీడీ ప్ర‌త్యేక ఆహ్వానితుల నియామ‌క జీవోపై హైకోర్టు స్టే

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితులను నియ‌మిస్తూ.. ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. ప్ర‌భుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తూ బుధ‌వారం మ‌ధ్యంత‌ర ఉత్వ‌రులు ఇచ్చింది. ఇటీవల టీటీడీ పాలకవర్గ సభ్యులతో పాటు, పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను ప్రభుత్వం నియమించిన సంగ‌తి తెలిసిందే.

టీటీటీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. నిబంధనలకు విరుద్ధంగా భారీగా బోర్డు సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిష‌న్ల‌లో పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులను నియ‌మించ‌డం వ‌ల్ల‌.. సామాన్య భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌లుగుతాయ‌ని పిటిషనర్ల తరఫున న్యాయవాది కోర్టుకు విన్న‌వించారు. ఈ మేరకు ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని కోర్టును కోరారు.

కాగా.. నిబంధనలకు అనుగుణంగా సభ్యుల నియామకం జరిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు.. ప్ర‌త్యేక ఆహ్వానితుల నియామ‌క జీవోను తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Next Story