ఎస్ఈసీ ఆదేశాల‌ను సస్పెండ్ చేసిన కోర్టు

AP High Court Suspend SEC Orders. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి బియ్యం సరఫరా చేసే వాహన రంగులు, చిత్రాలపై

By Medi Samrat  Published on  15 Feb 2021 8:27 PM IST
AP High Court Suspend SEC Orders

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి బియ్యం సరఫరా చేసే వాహన రంగులు, చిత్రాలపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.

గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం... పౌరసరఫరా అధికారులు ఎస్ఈసీకి రేషన్ వాహనాలను చూపారు. వాహనాలను పరిశీలించిన ఎస్ఈసీ రంగులు మార్చాలని.. వాహనాలపై ఉన్న ఫొటోలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తటస్థ రంగులు వేసి మరోసారి పరిశీలనకు తీసుకువస్తే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ శశిధర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రేషన్ అందించేందుకు వాహనాలను అనుమతించాలని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ పథకం అమల్లో ఉందన్నారు.

అమల్లో ఉన్న పథకానికి కొనసాగింపు మాత్రమేనని ధర్మాసనానికి తెలిపారు. వాహనంపై వైసిపి పార్టీ రంగులు కాకుండా ఇతర రంగులు సైతం ఉన్నాయని న్యాయస్థానానికి తెలిపారు. వాహనంపై ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు ఉంచవచ్చని సుప్రీంకోర్టు గతంలో తెలిపిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పేదలకు బియ్యం అందించే ప్రక్రియను నిలువరించటం సరికాదని పిటిషనర్ న్యాయవాది తెలిపారు.




Next Story