ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు సాగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ఒక్కతాటిపై రావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఎంటరయ్యారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా కనిపించని కేఏ పాల్‌ మరోసారి ఏపీ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లో కేఏ పాల్‌ కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం ఔచిత్యాన్ని ప్రశ్నించారు. కేంద్రం దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రభుత్వ రంగ సంస్దలను నష్టాల సాకుతో పెట్టుబడుల ఉపసంహరణకు ఎంపిక చేసుకోవడాన్ని కేఏ పాల్‌ తప్పుబట్టారు. తాజాగా ఏపీ హైకోర్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు షాకిచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం అంశంలో కేఏ పాల్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.

కేంద్ర గనులు, ఉక్కు శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ, విశాఖ స్టీల్ ప్లాంట్, ఏపీ సీఎస్ లను తన పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. సోమవారం ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. కాగా, అమెరికాలో ఉండి పిల్ ఎలా దాఖలు చేశారని కేఏ పాల్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే జీపీఏ ద్వారా పిల్ దాఖలు చేశామని పాల్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జీపీఏ ద్వారా ఎలా దాఖలు చేస్తారని కోర్టు మళ్లీ ప్రశ్నించింది. ఇలా కోర్టులో వాదనలు విన్న తర్వాత కేఏ పాల్ పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
సామ్రాట్

Next Story