ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కారణ కేసులో న్యాయస్థానం వీరికి రెండు వారాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అయితే.. ఐఏఎస్ లు న్యాయస్థానికి క్షమాపణలు చెప్పడంతో జైలు శిక్షకు బదులు సేవా కార్యక్రమాలు చేయాలని, ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.
పాఠశాలల ఆవరణలో ఎటువంటి ప్రభుత్వ భవానాలు నిర్మించకూడదని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాలను అమలు చేయని ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, గోపాలకృష్ణద్వివేది, శ్యామలారావు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎంనాయక్ లపై హైకోర్టు సీరియస్ అయింది. అధికారుల వైఖరిని హైకోర్టు.. కోర్టు ధిక్కారణగా భావించింది. ఈ క్రమంలోనే వీరికి రెండు వారాల జైలు శిక్ష విధించింది. అయితే.. వీరంతా బేషరతుగా న్యాయస్థానాన్ని క్షమాపణలు కోరడంతో పాటు సమాజ సేవ చేస్తామని చెప్పడంతో ఆ ఉత్తర్వులను సవరించింది. సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు నెలలో ఏదో ఒక రోజు సేవ చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థుల మధ్యాహ్న, రాత్రి భోజన ఖర్చులు, ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.