Amaravthi: జీవో నెంబర్ 45 అమలుపై స్టేకు హైకోర్టు నిరాకరణ

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదలాయించేందుకు

By అంజి  Published on  4 April 2023 10:15 AM GMT
AP High Court , CRDA, Amaravthi

Amaravthi: జీవో నెంబర్ 45 అమలుపై స్టేకు హైకోర్టు నిరాకరణ

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదలాయించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 45ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై సీజే జస్టిస్ మిశ్రా, జస్టిస్ మంటోజు గంగారావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ దశలో ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ)ని కోరింది.

కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత కోర్టు నిర్ణయం తీసుకుంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మరోవైపు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీఓ 45ను సవాలు చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి రైతుల పక్షాన వాదించిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌, హైకోర్టు న్యాయవాదులు ఆంజనేయులు, ఉన్నం మురళీధర్‌ మాట్లాడుతూ.. బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణాల కోసం అమరావతి రాజధాని ప్రాంతంలో రెసిడెన్షియల్‌ జోన్‌ (ఆర్‌-5) ఏర్పాటు చట్టవిరుద్ధమని అన్నారు.

రాజధాని అభివృద్ధికి కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగించరాదని హైకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందని వారు దృష్టికి తెచ్చారు. ప్రస్తుత జీవో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తోందని న్యాయవాదులు తెలిపారు. ఈ అంశం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్నందున పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కోర్టులు ఎలా అడ్డుకుంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అమరావతి భూముల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, మరెక్కడా మాట్లాడలేదన్నారు. రాజధాని భూములపై ​​మూడో వ్యక్తికి హక్కులు కల్పించడం సరికాదని వాదించారు.

Next Story