ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. దీంతో ఫిబ్ర‌వ‌రి నుంచి ఇంటింటికి రేష‌న్ స‌ర‌ఫ‌రా చేయాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అడ్డుక‌ట్ట‌ప‌డింది. ఈ పథకానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇంటింటికి రేష‌న్ అందించే వాహ‌నాల‌పై రాజ‌కీయ నేత‌ల ఫోటోలు, పార్టీ గుర్తులు ఉండ‌రాద‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు లోబ‌డే రేష‌న్ వాహ‌నాల ద్వారా పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వానికి న్యాయ‌స్థానం సూచించింది.

కార్య‌క్ర‌మ వివ‌రాల‌తో 2 రోజుల్లో ఎస్ఈసీని సంప్ర‌దించాల‌ని తెలిపింది. ఐదు రోజుల్లో ఈ అంశంపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. ప్రజా సంక్షేమ పథకాలు సొంత డబ్బులతో ఎవరూ చేయరని.. ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో పథకాలు నిర్వహిస్తారనేది గుర్తుంచుకోవాలని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజల కోసం పథకం కాబట్టి ఎస్ఈసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే.. రేషన్ డోర్ డెలివరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 9260 వాహనాలను ఈనెల 21న ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.
తోట‌ వంశీ కుమార్‌

Next Story