హైకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపుతట్టే అవకాశం
AP High Court Key Decision On Local Body Elections. ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
By Medi Samrat Published on 21 May 2021 11:41 AM ISTఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదని ..ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు అమలు కాలేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిషత్ ఎన్నికల్లో పాటించలేదని న్యాయస్థానం చెప్పుకొచ్చింది. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎలక్షన్ కోడ్ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఫాలో అవ్వకుండా ఎన్నికలు జరిగాయన్న పిటీషనర్ల వాదనపై హైకోర్టు మొగ్గుచూపింది. ఆ ఎన్నికే చెల్లదని.. ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసింది.
ఏపీలో పరిషత్ ఎన్నికల రీ షెడ్యూల్ ఏప్రిల్ 2న విడుదలైన విషయం తెలిసిందే. అదే రోజున నోటిఫికేషన్ విడుదలైంది. 8న పోలింగ్ నిర్వహించి, 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు నిర్వహించినప్పటికీ, కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు జరగలేదు. నేడు ఏపీ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో కానీ, సుప్రీం కోర్టులో కానీ సవాల్ చేసే యోచనలో ఉంది.