ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
AP High Court key comments on ssc and inter exams.ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 30 April 2021 12:47 PM IST
ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని సీఎం జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. కాగా.. ఈ పిటిషన్లపై నేడు(శుక్రవారం) హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనాతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది.
లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయమని తెలిపింది. కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. కేంద్రం నిబంధనల ప్రకారం వారు ఐసోలేషన్ లేదా ఆస్పత్రిలో ఉండాలని అని కోర్టు పేర్కొంది. అయితే.. కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పక్కరాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసిన న్యాయస్థానం.. పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.
సీఎం జగన్ ఏం చెప్పారంటే..?
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమన్నారు. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయమని డిమాండ్ చేయడం సులభమని.. కానీ అలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఉన్నత చదువల కోసం ప్రయత్నించినా.. ఉద్యోగాల వేటలో ఇంటర్వ్యూకు వెళ్లినా పది, ఇంటర్ పరీక్షల్లో మార్కులే పరిగణలోకి తీసుకుంటారని.. కేవలం సర్టిఫికేట్ పై పాస్ అని ఉంటే వారి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి భరోసా కల్పిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం జగన్ అన్నారు.