ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు ఏపీ హైకోర్టులో మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గల‌గా.. రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ఊర‌ట ల‌భించింది. మంత్రి మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు అనుమ‌తించింది. గతంలో మీడియాతో మాట్లాడొద్దని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులోని డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్ ను పరిశీలించిన న్యాయస్థానం పెద్దిరెడ్డికి ఊరటనిచ్చే విధంగా తీర్పు ఇచ్చింది. ఎస్ఈసిని లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చెయ్యొద్దని ఆదేశించింది.

పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని ఇంటికే ప‌రిమితం చేయాలని, మీడియాతో మాట్లాడ‌కుండా చూడాల‌ని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్.. ఇటీవ‌ల డీజీపీని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఎస్ఈసీ ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు సింగిల్ జ‌డ్జి ధ‌ర్మాస‌నం పెద్దిరెడ్డిని ఇంటికే ప‌రిమితం చేయాల‌న్న ఆదేశాల‌ను ర‌ద్దు చేసింది. అయితే.. మీడియాతో మాట్లాడ‌కుండా చూడాల‌న్న ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ఆదేశాల‌పై పెద్దిరెడ్డి డివిజ‌న్ బెంచ్‌కు అప్పీల్ చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు అనుమ‌తి ఇచ్చింది.


తోట‌ వంశీ కుమార్‌

Next Story