అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌పై రేపు తీర్పు
అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 3:18 PM IST
అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌పై రేపు తీర్పు
అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు హైకోర్టు ధర్మాసనం వాదనలు విన్నది. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో ఆగస్టు 4న చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళ్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడటం.. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే.. ఈ సంఘటన తర్వాత చంద్రబాబు సహా టీడీపీకి చెందిన మొత్తం 179 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబుని ఏ1గా చేర్చారు పోలీసులు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో పలువురు టీడీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. విచారణ అనంతరం వారికి ముందస్తు బెయిల్ దొరికింది.
అంగళ్లు కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ పై సెప్టెంబర్ 26న ఆయన తరఫున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబుపై వైసీపీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులే కేసు పెట్టారని.. రాజకీయ కక్షలో భాగమే అని వాదించారు. రాళ్లు రువ్విన ఘటనలో చంద్రబాబు ఎన్‌ఎస్‌జీ కమాండర్లు ఆయన్ని కాపాడారని చెప్పుకొచ్చారు. అంగళ్లు ఘటనలో టీడీపీ నాయకులు, చంద్రబాబు బాధితులు అని.. బాధితులపైనే కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. అయితే.. ఈ కేసులో ఇప్పటికే చాలా మందికి బెయిల్ వచ్చిందనీ.. చంద్రబాబుకి కూడా బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుని చంద్రబాబు తరుఫు లాయర్ కోరారు. ఇక ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. శుక్రవారం వెల్లడిస్తామని ప్రకటించింది.