ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్వర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. రేపు జరగాల్సిన ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి. తమ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించకూడదని హైకోర్టు ఆదేశించింది.
అనుకున్న సమయానికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావడంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. అధికారులు, ఎన్నికల సిబ్బంది ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల ఏర్పాట్ల కోసం ఏపీ సర్కారు నేడు, రేపు సెలవు ప్రకటించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానం వెంటాడింది. ఇవాళ డివిజన్ బెంచ్ తీర్పుతో రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయనున్నారు.
ఏప్రిల్ 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 126 జడ్పీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,82,15,104 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.