తీపి కబురు.. నేడు వారి ఖాతాల్లోకి రూ.703 కోట్లు
AP Govt will transfer RS 703 crore funds into beneficiaries.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు అర్హులుగా ఉండి లబ్దిపొందని వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు సంక్షేమ పథకాల లబ్థిని పొందని 18.48లక్షల మంది ఖాతాల్లో మంగళవారం రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు తెలిపింది. సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ నేడు కంప్యూటర్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులుగా ఉండి.. ఏ కారణంచేతనైనా సంక్షేమ పథకాల లబ్ధిని పొందని వారికి ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్ నెలల్లో నగదును జమచేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
సీఎం కాకముందు జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చారు. అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాలను ఆపలేదు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా సీఎం సాయం అందిస్తున్నారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ నేతన్న హస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహనమిత్ర ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు ఆర్థికంగా భరోసా ఇస్తున్నారు.
ఇక ఈ పథకాలకు అర్హులై ఉండి.. ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారు సంక్షేమ పథకం అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన వారికి డిసెంబర్ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి జూన్‌లో లబ్ధి కల్పిస్తారు. జూన్ నుండి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి డిసెంబర్‌లో లబ్ధి కల్పిస్తారు.