నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఏపీ సర్కార్ టోల్ ఫ్రీ నెంబర్
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు పౌరులకు సహాయం చేయడానికి ఆంధ్ర భవన్‌లో అత్యవసర విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది
By - Knakam Karthik |
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు పౌరులకు సహాయం చేయడానికి ఆంధ్ర భవన్‌లో అత్యవసర విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడును, ఆంధ్ర భవన్ అధికారులను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరినట్లు తెలిపారు.
నేపాల్ లో ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం 187 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా నేపాల్ లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నారు. బఫాల్ లో చిక్కుకున్న 27 మంది శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సిమిల్ కోట్ లో కారి అప్పారావు వద్ద 12 మంది, పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగలస్థాన్ లో 90 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేపాల్ లోని భారత రాయబారి నవీన్ శ్రీ వాస్తవకు పరిస్థితిని వివరించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. తెలుగు ప్రజల భద్రతే ప్రాధాన్యంగా మంత్రి నారా లోకేష్ కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేయడం జరుగుతోంది.
నేపాల్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో మంత్రి లోకేశ్ సమన్వయం చేస్తున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.