వారిని ఇకపై అలా పిలిస్తే కఠిన చర్యలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP govt puts ban on derogatory words used to refer Nayee Brahmins. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులు, వారి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న కొన్ని పదాలపై

By అంజి  Published on  11 Aug 2022 5:11 PM IST
వారిని ఇకపై అలా పిలిస్తే కఠిన చర్యలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులు, వారి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న కొన్ని పదాలపై సర్కార్ నిషేధం విధించింది. దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్‌మీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో నాయీ బ్రహ్మణుల సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. మంగలి, మంగళోడ, బుచ్చగొరిగెవాడ, మంగళిది, కొండ మంగలి వంటి పదాలు నాయీ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. ఈక్రమంలోనే ఆ పదాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

ఎవరైనా అలా పిలిస్తే.. భారతీయ శిక్షాస్మృతి 1860 ప్రకారం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి తెలిపారు. ఈ మేరుకు ఆగస్టు 7న జీవో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుల దూషణలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జీవోను విస్తృతంగా ప్రచారం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడాలని నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

పలు ప్రాంతాల్లో జగన్‌ చిత్రపటానికి పాలతో అభిషేకించి.. జగన్‌ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. నాయీబ్రాహ్మణులను కించపరిచే పదాలను ఏపీ ప్రభుత్వం నిషేధించడంపై తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నయీం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులకు జగనన్న చేదోడు పథకం అమలు చేస్తూ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. తమ సామాజికవర్గాన్ని ఉన్నతంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పలువురు నాయీ బ్రహ్మణులు అంటున్నారు.


Next Story