అమరావతి: ప్రొబేషన్ పీరియడ్‌లో విధుల్లో ఉండగా మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రొబేషన్ సమయంలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
సర్వీసులో ఉన్న గ్రేడ్-1, 2 వీఆర్వోలు మరణిస్తే కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య అపాయింట్‌మెంట్ ఇచ్చేలా ఏపీ వీఆర్వో సర్వీస్ రూల్స్-2008ని సవరిస్తూ సెప్టెంబర్ నెలలో రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తమ అభ్యర్థనను పరిశీలించి మరణించిన వీఆర్వో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉపాధి కల్పించినందుకు వీఆర్వోలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.