అమరావతి: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. "స్త్రీ శక్తి" పథకానికి అదనంగా రూ.800 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ నుంచి మార్చి 2026 వరకు స్త్రీ శక్తి పథకం అమలు కోసం నిధులు విడుదలకు పరిపాలనా పరమైన అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నెలకు రూ.160 కోట్ల చొప్పున 5 నెలలకు ముందస్తుగా నిధుల విడుదల చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
గత నెలలో ఆగస్టు నుంచి అక్టోబర్ నెల వరకు సంబంధించిన రూ.400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 2025-26 ఆర్ధిక సంవత్సరానికి స్త్రీశక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు నిధులు వెచ్చించింది. పథకం సమర్థంగా అమలుకు నిధులు కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బస్సుల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ కి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.