డ్వాక్రా సంఘాలకు శుభవార్త.. 48 గంటల్లోనే లోన్‌

మహిళల ఆర్థిక సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన 'స్త్రీ నిధి' పథకాన్ని డిజిటల్‌ విధానంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By -  అంజి
Published on : 9 Feb 2026 8:00 AM IST

AP govt, Stree Nidhi scheme, dwcra, women financial empowerment

డ్వాక్రా సంఘాలకు శుభవార్త.. 48 గంటల్లోనే లోన్‌

అమరావతి: మహిళల ఆర్థిక సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన 'స్త్రీ నిధి' పథకాన్ని డిజిటల్‌ విధానంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైక్రో ఫైనాన్స్‌ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న రూ.5 లక్షల లోన్‌ను రూ.8 లక్షలకు పెంచింది.

ఒక వేళ రుణం తీసుకున్న గ్రహీత మరణిస్తే, ఆ కుటుంబంపై భారం పడకుండా స్త్రీనిధి సురక్ష యోజన కింద రుణాన్ని రద్దు చేసే వెసులుబాటు కూడా ఉంది. స్వయం సహాయక సంఘాల పనితీరు, ఆర్థిక బలోపేతమైన విధానాన్ని బట్టి వాటిని A, B, C, D గ్రేడ్లుగా వర్గీకరించి రుణాలను అందిస్తున్నారు. డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకొనే రుణాల్లో గతంలో మాదిరిగా అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ‘మన డబ్బులు-మన లెక్కలు’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.

అటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నగరాలు, పట్టణాల్లో ఎగ్ మార్టులు ఏర్పాటు చేసుకునేందుకు మెప్మా ఆధ్వర్యంలో ఉపాధి కల్పించనుంది. ప్రతి జిల్లాలో పది చొప్పున మొత్తం 260 మార్టులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మార్ట్ ఏర్పాటుకు 50 వేల రూపాయల చొప్పున నిధులు సమకూర్చనున్నారు.

Next Story