సీఎం వైఎస్ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కందుకూరు, గుంటూరుల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో తొక్కిసలాట అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గుంటూరు, కందుకూరు ఘటనలను దృష్టిలో పెట్టుకుని నిన్న రాత్రి హోంశాఖ మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను వెలువరించింది. హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్టు నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేని ప్రత్యామ్నాయ ప్రదేశాలు గుర్తించాలని సూచనలు ఇచ్చారు. సభలు, రోడ్డు షోలు నిర్వహించే రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రదేశాల ఎంపికపై సూచనలు చేశారు. అలాగే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చూడాలని హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇబ్బంది లేని ప్రదేశాల్లో సభలకు పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించింది.
మార్గదర్శకాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ హెచ్చరించింది. ఇరుకు రోడ్లు, సందుల్లో ఎలాంటి సభలు నిర్వహించడానికి అనుమతి లేదు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, కమిషనర్ల పర్మిషన్ తీసుకుని ఆ ప్రదేశాల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.