నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది 6 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశించడంతో వచ్చే ఏడాది ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీ చేపట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఏపీపీఎస్సీ మరో శుభవార్త చెప్పింది. 670 జూనియర్ అసిస్టెంట్, 170 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆంజనేయులు తెలిపారు. ఒక్కొక్కటిగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. 18 నెలల్లో 30 నోటిఫికేషన్‌లు విడుదల చేసి 3 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. కరోనా సమయంలోనూ ఏపీపీఎస్సీ ద్వారానే అధిక సంఖ్యలో నియామకాలు జరిగాయన్నారు.