రేషన్‌కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి..

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది.

By Srikanth Gundamalla  Published on  27 Nov 2023 1:07 AM GMT
AP Govt, good news,  ration card holders,

రేషన్‌కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి..

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో కందిపప్పు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే.. నాలుగు నెలలుగా సరుకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని.. దాంతో కొన్ని చోట్ల మాత్రమే సరఫరా జరుగుతోందని వెల్లడించింది. కానీ.. డిసెంబర్‌ నుంచి మాత్రం పూర్తిస్థాయిలో కందిపప్పు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ సర్కార్ ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో పూర్తిస్థాయిలో రేషన్‌కార్డులు ఉన్నవారికి సబ్సిడీ కందిపప్పు అందిస్తామని వెల్లడించారు ప్రభుత్వ అధికారులు. అంతేకాదు ప్రభుత్వం గోధుమ పిండిని రూ.16కే సరఫరా చేస్తుంది.

ఇందులో భాగంగానే రైతుల నుంచి ఏపీ ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు కందుల కొనుగోలుపై ప్రచారం కల్పించారు. రైతుల నుంచి మార్కెట్ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్రానికి వాడుకుంటే.. రైతులకు, లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. ప్రభుత్వం కందిపప్పును సబ్సిడీపై కిలో రూ.67కు పంపిణీ చేస్తోంది. గడిచిన 4 నెలలుగా సరకు అందుబాటులో లేకపోవడంతో దానికి ఆటంకం ఏర్పడింది. తాజాగా హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ అసోసియేషన్‌ ద్వారా పౌరసరఫరాల శాఖ సుమారు 10వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. స్థానిక రైతుల ద్వారా కందులు కొనుగోలు చేయడంతో పాటు ప్రాసెసింగ్‌ చేసి అందించనుంది ఏపీ సర్కార్.

రాష్ట్రంలోని రైతుల నుంచి నేరుగా కందులు కొనుగోలు చేసి మిల్లింగ్ అనంతరం పీడీఎస్ ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో పండే చిరుధాన్యాలు, కందులు స్థానికంగానే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు సంపూర్ణ మద్దతుధర అందించి.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story