ఏపీలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు
AP Govt finalized private schools and colleges fees.రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు రాష్ట్ర
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2021 8:27 AM ISTరాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసును ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
- గ్రామ పంచాయతీల పరిధిలోని జూనియర్ కళాశాలల్లో సైన్స్ గ్రూపులకు రూ.15 వేలు ఫీజుగా నిర్ణయించారు. ఆర్ట్స్ గ్రూపులకు రూ.12 వేలు ఫీజు నిర్ణయించారు. పురపాలక సంఘాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో సైన్స్ గ్రూపులకు రూ.17,500, ఆర్ట్స్ గ్రూపులకు రూ.15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- నగరపాలక సంస్థల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో సైన్స్ గ్రూపులకు రూ.20 వేలు, ఆర్ట్స్ గ్రూపులకు రూ.18 వేలు ఫీజుగా నిర్ణయించారు.
-ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, ప్రవేశం,పరీక్ష, లేబొరేటరీ, క్రీడలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, అదనపు బోధనా కార్యకలాపాలు, విద్యార్థి సంక్షేమ నిధి, ఆరోగ్య సంరక్షణ పథకం, స్టడీటూర్, అల్యూమ్ని, ఇతర విద్యాసంబంధ రుసుములన్నీ ఇందులోనే కలిసి ఉంటాయని పేర్కొంది.
- ఒకవేళ విద్యార్థి ఎంచుకుంటే.. అదనంగా రవాణా, వసతి తదితర రుసుములు తీసుకోవచ్చు. రవాణా రుసుములకు సంబంధించి కిలో మీటరుకు రూ.1.20 చొప్పున తీసుకోవాలని, వసతి గృహాల్లో ఉండే వారైతే.. ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో రూ.18వేలు, పురపాలక సంఘాల్లోని వాటికి రూ.20వేలు, నగర పాలక సంస్థల్లో ఉంటే రూ.24వేలకు మించకూడదు.
- వసూలు చేసే ఫీజులకు సంబంధించిన రసీదులను వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఆదాయపు పన్ను వివరాలతో కూడిన ఆర్థిక నివేదికలను బహిరంగంగా ప్రదర్శించాలి. ఆదాయపు పన్ను మినహాయింపులను పొందుపరచాలి.
పాఠశాల్లో ఫీజులు ఇలా..
- స్కూళ్లకు నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఫీజులు ఖరారు చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.10,000, హైస్కూల్ విద్యకు రూ.12,000 పురపాలక పరిధిలోని స్కూళ్లలో ప్రైమరీ విద్యకు రూ.11,000, హైస్కూల్ విద్యకు రూ.15,000, కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.12,000, హైస్కూల్ విద్యకు రూ.18,000 ఫీజు గా నిర్ణయించారు.