జల జగడం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Govt filed petition in SC on Krishna Water Issue.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల జగడం ఇప్పట్లో
By తోట వంశీ కుమార్ Published on 14 July 2021 7:39 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల జగడం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. గత కొద్ది రోజులుగా నీటిని వాడుకోవడం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. చట్టబద్దమైన నీటి వాటాను తెలంగాణ రానీయట్లేదని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.
నాగార్జున సాగర్, శ్రీశైలం, కేఆర్ఎంబీ పరిధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, విభజన చట్టం ప్రకారం నడుచుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది. శ్రీశైలంలో తక్కువ నీరున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేసింది. వారి తీరుతో ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తెలంగాణ చర్యలు రాజ్యాంగ విరుద్దం. ఆ రాష్ట్ర వైఖరి మా ప్రజల జీవించే హక్కును హరించేలా ఉంది. విభజన చట్టంలోని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు అమలు చేయడం లేదు. కేఆర్ఎంబీ, కేంద్రం ఆదేశాలను సైతం తెలంగాణ అమలు చేయడం లేదని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సర్కార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)లో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్రరావు దీనిపై వాదించారు. గతంలో రాయలసీమ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై విచారణను ఎన్జీటీ సోమవారానికి(జులై 12) వాయిదా వేసింది. కానీ, సోమవారం విచారణకు రాకపోవడంతో తాము కూడా ధిక్కరణ పిటిషన్ వేశామని ఏఏజీ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు.
గత ఎన్జీటీ ఆదేశాల ప్రకారం కేఆర్‌ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి సోమవారం నివేదిక సమర్పించాల్సి ఉందని ఏఏజీ వివరించారు. కానీ ఏపీ ప్రభుత్వం.. తనిఖీ చేయకుండా అధికారులను అడ్డుకోవడంతో ఇంతవరకు ఆ విభాగాలు నివేదిక ఇవ్వలేదని రామచంద్రరావు ఎన్జీటీకి తెలిపారు. స్వయంగా ఎన్జీటీనే రంగంలోకి దికి ప్రాజెక్టును తనిఖీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం వేసిన ధిక్కరణ పిటిషన్‌ను జతచేసి విచారణ చేపట్టాలని ఏఏజీ కోరారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం తమ దృష్టిలో ఉందని, జాబితా ప్రకారం ఈ నెల 23న విచారణ జరుపుతామని ఎన్జీటీ పేర్కొంది.