ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమణ
AP Govt Employees Withdraw Strike.పీఆర్‌సీ సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 6 Feb 2022 8:10 AM ISTపీఆర్సీ సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఉద్యోగసంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీతో కుదిరిన ఒప్పందం మేరకు ఉద్యోగ సంఘాలు తాము చేపట్టాలనుకున్న సమ్మెను విరమించుకున్నాయి. దీనిపై మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు సంయుక్తంగా మీడియా సమావేశంలో ప్రకటించారు. దాదాపు 7 గంటల పాటు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ జరిగింది. హెచ్ఆర్ఏ కొంతమేర పెంచేందుకు, సీసీఏ కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఐదేళ్లకు ఒకసారి పీఆర్‌సీ విధానాన్నే కొనసాగించాలని, ఐఆర్ రికవరీ చేయరాదని ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లకు శుక్రవారమే మంత్రుల కమిటీ ఆమోదించగా.. శనివారం మరికొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. అయితే.. ఫిట్‌మెంట్‌ను 23 శాతం కంటే పెంచాలన్న డిమాండ్‌కు మాత్రం అంగీకరించలేదు. ఇక మెడికల్ రీయంబర్స్‌మెంట్ సదుపాయాన్ని పొడిగించేందుకు ఒప్పుకుంది. ఉద్యోగులు, పెన్షనర్లు మరణిస్తే అంతిమ సంస్కారాలకు రూ.25వేలు ఇవ్వనున్నారు. ఇక పెంచిన గ్రాట్యుటీని 2018 నుంచి కాకుండా 2022 జనవరి నుంచి మాత్రమే అమలు చేస్తామంది. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తమ పట్టు కొంత సడలించి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు అంగీకారం తెలిపారు. అయితే.. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాత్రం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో విభేదించారు.
సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం : ఉద్యోగ సంఘాలు
సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. మంత్రుల కమిటీతో రెండ్రోజులపాటు సుదీర్ఘంగా చర్చించాం. మాకు జరిగిన అన్యాయం గ్రహించి సానుకూలంగా చర్చించారు. మంత్రుల కమిటీ ఎదుట అనేక డిమాండ్లు ఉంచి వివరంగా చర్చించాం. సీఎం జగన్‌పై ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు అడగకుండానే సీఎం అనేక ప్రయోజనాలు కల్పించారు. మా చిన్న చిన్న మాటలను పట్టించుకోవద్దని సీఎంను కోరుతున్నాం. ఐదు డీఏలు ఒకేసారి ఇచ్చి మాకు మేలు చేశారు. మా డిమాండ్లు నెరవేర్చింనందుకు సీఎంకు కృతజ్ఞతలు అని మీడియాతో ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు.
ఏకాభిప్రాయంతో సమస్యల పరిష్కారం : సజ్జల
ఉన్నంతలో మెరుగైన పీఆర్‌సీనే ఇచ్చినప్పటికీ ఉద్యోగులు ఆశించనంతగా లేనందున వారు చెందిన ఆవేదన అసంతృప్తిని గుర్తించాక వాటిలో కొన్నింటినైనా చక్కదిద్దాలన్న లక్ష్యంతో మంత్రుల కమిటీ ఏర్పాటైంది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో వారు ప్రస్తావించిన ప్రతి అంశంపై లోతుగా చర్చించాం. వాటిపై ఏకాభిప్రాయానికి వచ్చాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని భావించిన సీఎం వారి డిమాండ్‌లపై సానుకూలంగా స్పందించారు.