ఏపీ రైతులకు గుడ్‌న్యూస్..ఆ పథకంలో అర్హుల నమోదుకు గడువు పెంపు
వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతుల నమోదుకు మరోసారి గడువుని పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 7:12 AM ISTఏపీ రైతులకు గుడ్‌న్యూస్..ఆ పథకంలో అర్హుల నమోదుకు గడువు పెంపు
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతుల నమోదుకు మరోసారి గడువుని పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. కొత్తగా భూ యజమానులైన రైతు కుటుంబాలు రైతు భరోసా పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు భరోసాకు అర్హత కలిగిన భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దేవదాయ భూముల కౌలుసాగుదారులు, అటవీ భూ హక్కుదారులు ఆధార్, సీసీఆర్సీ, హూహక్కు పత్రాలతో ఆర్బీకేల్లో వీవేఏలు, వీహెచ్‌ఏలను సంప్రదించాలని చెప్పారు.
కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం రైతుభరోసా ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మొదటి విడతలో రూ.7,500, రెండో విడతలో రూ.4,000, మూడో విడతలో రూ.2,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో బటన్ నొక్కి డబ్బులను ఖాతాల్లోకి విడుదల చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇక వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద అందిస్తోన్న మొత్తం రూ.13,500 ల్లో రాష్ట్ర ప్రభుత్వం వాఆ రూ.7,500 కాగా.. మిగిలిన రూ.6000 కేంద్రం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారా అందిస్తోంది. వ్యవసాయ భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం వర్తిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. వచ్చే నెల మొదటివారంలోనే రైతులకు రైతుభరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనేపథ్యంలో ఇంకా పేర్లు నమోదు చేసుకోని వారు ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ క్రమంలో గడువుని పెంచుతూ ప్రకటన చేసింది.