మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాలగా నామకరణం చేసింది. ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు రాష్ట్రానికి, దేశానికి పింగళి వెంకయ్య చేసిన విశేష సేవలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పేరు పెట్టడంతో ఆయన వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా మచిలీపట్నం ప్రజల ఆకాంక్షలను కూడా నెరవేరుస్తుందన్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఆమోదించడం విశేషం.
పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారత జెండా రూపకర్తగా దేశ ప్రజల మనస్సులో నిలిచిపోయారు. వెంకయ్యకు ఈ నివాళి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ స్వాగతించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఆయన మువ్వన్నెల జెండాను రూపొందించి పింగళి వెంకయ్య జాతికి అందించారని కొనియాడారు. మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆ మహనీయుడి పేరు పెట్టడం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భావితరాలకు అందుతుందని తెలిపారు.