ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్‌గా గౌత‌మ్ స‌వాంగ్‌.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

AP Govt appoints Gautam Sawang as APPSC chairman.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2022 10:50 AM IST
ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్‌గా గౌత‌మ్ స‌వాంగ్‌.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేర‌కు ఏపీ సీఎస్ స‌మీర్ శ‌ర్మ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. గురువారం ఉద‌యం దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు పంపింది. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలుప‌డంతో ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ఉదయ్‌భాస్కర్‌ పదవీకాలం ఆరునెలల క్రితం పూర్తయింది. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసిన సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స‌వాంగ్ స్థానంలో డీజీపీగా ఇంటిలిజెన్స్ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్ చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. చిత్తూరు, వరంగల్‌ జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2001 నుంచి 2003 వరకు వరంగల్‌ రేంజి డీఐజీగా, 2003 నుంచి 2004 వరకు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఐజీగా, 2004 – 2005 వరకు APSP డీఐజీగా బాధ్యతలు నిర్వ‌ర్తించారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా పనిచేసిన సవాంగ్‌ 2008 నుంచి 2009 వరకు శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేశారు. 2016-2018 వరకూ విజయవాడ సీపీగా, 2018 జులైలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఆగస్ట్‌ 3న ఏపీ డీజీపీగా బాద్యతలు చేపట్టారు. 2023 జూలై 31 వరకు సర్వీసు ఉండగా ఆకస్మాత్తుగా బదిలీ వేటు ప‌డింది. ప్ర‌స్తుతం ఆయ‌న్ను ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది.

Next Story