తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాయితేజ్ కుటుంబాన్ని పరామర్శించి.. ప్రభుత్వ సాయాన్ని అందివ్వనున్నట్లు తెలుస్తోంది.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు సాయితేజ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ దంపతులు, సాయితేజ సహా మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. సాయితేజ మృతదేహం గుర్తింపు ప్రక్రియ పూరైంది. ఢిల్లీ నుంచి సాయితేజ్ పార్థివదేహాన్ని స్వగ్రామం ఎగువరేగడికి తరలిస్తున్నారు. నేటి సాయంత్రానికి సాయితేజ భౌతిక కాయం జిల్లాకు చేరుకోనుంది. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.