సినీ ప్రియులకు శుభవార్త.. థియేటర్లలో 100శాతం సీటింగ్‌కు ప్రభుత్వం అనుమతి
AP Govt allows 100 Occupancy in Cinema Halls.సినీ ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని
By తోట వంశీ కుమార్ Published on 14 Oct 2021 8:53 AM ISTసినీ ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని థియేటర్లలో 100 శాతం సీటింగ్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాహాల్స్‌తో పాటు ఫిక్స్‌డ్ సీటింగ్ ఉన్న ఫంక్షన్ హాళ్లు, సమావేశ మందిరాల్లోనూ నూరుశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఆగస్ట్‌లో ఓపెన్ అయిన థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఇప్పటివరకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తిస్థాయిలో(100 శాతం) సీటింగ్‌కు అవకాశం కల్పించింది. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు నేటి(గురువారం) నుంచిఈ నెల 31 వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
తగ్గిన కర్ఫ్యూ సమయం..
ఇక రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు వేళలు తగ్గాయి. అర్థరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. వివాహాలు, ఇతర కార్యక్రమాలకు 250 మందికి పరిమితి విధించింది. అయితే.. కొవిడ్ నిబంధనలు మాత్రం పాటించాలని స్పష్టం చేసింది. మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది.
బుధవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 517 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8 మంది మరణించారు. 826 మంది కరోనా నుంచి కోలుకుగా.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6,615 యాక్టివ్ కేసులున్నాయి. కాగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 20,58,582 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 20,37,691 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 14,276 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 2,88,39,595 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.