సునీల్ కుమార్‌పై చర్యలకు డీజీపీకి ఏపీ ప్రభుత్వం ఆదేశం
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
By అంజి Published on 26 Feb 2023 9:45 AM GMTఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్
అమరావతి: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి డీజీపీకి మెమో పంపారు. ''ఈ విషయంలో తగిన చర్య తీసుకోవలసిందిగా, అలాగే ఈ విషయంలో తీసుకున్న చర్యల నివేదికను వెంటనే అందజేయవలసిందిగా ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు'' ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
సునీల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తూ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ 17 నవంబర్ 2022న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ పంపిన తర్వాత ఇదంతా ప్రారంభమైంది. ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకునేందుకు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని, ఎంపిక చేసుకున్న పౌరులను అరెస్ట్ చేస్తున్నారని న్యాయవాది ఆరోపించారు. దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతిస్పందిస్తూ ఫిబ్రవరి 3న సునీల్ కుమార్‌పై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
31 డిసెంబర్ 2022న పీవీ సునీల్ కుమార్ పదోన్నతి పొంది సీఐడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించబడ్డారు. ఒక వారం తరువాత జనవరి 23న అతను బదిలీ చేయబడి, సాధారణ పరిపాలన విభాగంలో ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేశాడు.