ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం

AP Government to construct Digital Libraries in every villages.ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 7:15 AM IST
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతీ గ్రామ పంచాయితీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో తొలి విడుద‌త‌లో 4,530 వైఎస్ఆర్ డిజిట‌ల్ లైబ్ర‌రీల‌ను నిర్మించ‌నున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ తెలిపారు. అందులో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ.140కోట్ల‌ను వెచ్చించ‌నున్న‌ట్లు చెప్పారు. క్యాంపు కార్యాల‌యంలో సీఎం అధికారుల‌తో స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్ర‌తి గ్రామంలో డిజిట‌ల్ లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. మొద‌టి విడ‌త లైబ్ర‌రీల నిర్మాణ ప‌నుల‌ను ఆగ‌స్టు 15న ప్రారంభించి వ‌చ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్పారు. డిజిటల్ లైబ్రరీలు ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తో పాటు గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌కు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అలాగే డిజిటల్ లైబ్రరీల నుంచి పని చేసుకునేలా సదుపాయాన్ని కల్పించాలని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పెట్టడమే కాకుండా.. నిరంతర నెట్ సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

డిజిటల్‌ లైబ్రరీ బిల్డింగ్‌‌లలో కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్‌టాప్‌లు, యూపీఎస్, డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్, స్కానర్, లేజర్‌ ప్రింటర్‌, సాఫ్ట్‌వేర్, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్, అన్‌లిమిలెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్ ఉండాల‌ని సూచించారు. స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్‌ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని అధికారుల‌ను ఆదేశించారు. ఈ స‌మావేశంలో మంత్రి గౌత‌మ్ రెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌య‌ల‌క్ష్మీ, పైబ‌ర్ నెట్ ఎండీ మ‌ధుసూద‌న్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story