ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీ ప్రభుత్వం నేడు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2021-22 సంవత్సరానికి సుమారు రూ.2.30 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఒక్క రోజుకే పరిమితం కానున్నాయి. శాసనసభ, మండలి సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. రెండేండ్లుగా ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే దాదాపు రూ.40 వేల కోట్ల వరకు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమచేసే పథకాల బడ్జెట్‌లో ప్రాథాన్యమివ్వనున్నారు. ప్రస్తుతం ఇస్తున్న సామాజిక ఫించన్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.2.25ం నుంచి రూ.2500కు పెంచనుంది.
ఈ రోజు ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించి బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. తరువాత ఉదయం 9 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ విధానం ద్వారా రాజ్‌భవన్ నుంచే ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభా కార్యకలాపాల్ని వాయిదా వేసి, సభా వ్యవహరాల కమిటీ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చిస్తారు. ఉదయం 11గంటల తరువాత ఆర్థిక మంత్రి రాజేంధ్రనాథ్ రెడ్డి రూ.2.30లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్‌పై చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ఆమోదించి మండలికి పంపించనున్నారు.