వాలంటీర్ల పట్ల పవన్ వ్యాఖ్యలపై హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల పట్ల పవన్ చేసిన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla
వాలంటీర్ల పట్ల పవన్ వ్యాఖ్యలపై హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై సంచనల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రజల డేటా మొత్తం వాలంటీర్ల చేతిలో ఉందని.. అంతేకాక వుమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ కూడా పవన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇక వాలంటీర్లు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. అయితే.. తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల పట్ల పవన్ చేసిన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకుంది. పవన్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని ఏపీ ప్రభుత్వం భావించింది. అందుకే హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. వార్డు సచివాలయ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని వాలంటీర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లలోని మహిళలను కించపరిచేలా.. అవమానకరమైన, విషపూరిత వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛందంగా సేవలందించే వాలంటీర్లను పవన్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. దాంతో.. పవన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించి ఆందోళనలకు దారి తీశారని ప్రభుత్వం భావించింది. త్వరలోనే పవన్‌పై ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయనుంది.