అమరావతి: డీఎస్సీ దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. డీఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈక్రమంలోనే సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే వెరిఫికేషన్ సమయంలో మాత్రం ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలని పేర్కొన్నారు మొత్తం 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మే 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనున్నాయి. డీఎస్సీ పోస్టులకు 6 లక్షలకుపైగా దరఖాస్తులు వస్తాయని అంచనా. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ప్రణాళికతో చదివితే విజయం సాధించవచ్చు.
''ప్రియమైన డీఎస్సీ అభ్యర్థులారా.. దృష్టి కేంద్రీకరించి నిబద్ధతతో ఉండండి!. మీ ప్రాతినిధ్యాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత దయచేసి ఈ క్రింది ముఖ్యమైన నవీకరణలను గమనించండి: డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు యొక్క పార్ట్ 2 కింద సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయడం ఇప్పుడు ఐచ్ఛికం. సర్టిఫికెట్ ధృవీకరణ సమయంలో అసలు సర్టిఫికెట్‌లను సమర్పించాలి. డీఎస్సీ అర్హత కోసం గ్రాడ్యుయేషన్/పోస్ట్-గ్రాడ్యుయేషన్ మార్కుల ప్రమాణాలు TET ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. మీ అంకితభావం, శ్రద్ధ మీ విజయానికి మార్గం సుగమం చేస్తాయి. మీకు శుభాకాంక్షలు'' అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.