అమరావతి: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికుల సంక్షేమంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం.. సంక్షేమ బోర్డులో నిర్మాణ రంగ కార్మికుల పేర్ల నమోదుకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించింది. ఇది జూన్ మొదటి వారం నుండి అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇందులో పేర్లు నమోదు చేసుకున్న వారు బోర్డు అందించే సంక్షేమ పథకాలు నేరుగా పొందవచ్చు.
రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఉండగా.. 20.22 లక్షల మంది మాత్రమే బోర్డులో పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా ఇప్పుడు తీసుకురాబోయే ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా గుర్తింపు కార్డును సైతం వెంటనే పొందవచ్చు. ఇప్పటి వరకు బోర్డులో పేర్లు నమోదు చేసుకోవాలంటే సహాయ కార్మిక అధికారిని సంప్రదించాల్సి వచ్చేది. ఇకపై ఈ సమస్యకు చెక్ పడనుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా పకడ్బందీగా కార్మికుల సంక్షేమ బోర్డు పన్ను వసూళ్లు చేయనుంది. కార్మికుల సంక్షేమం కోసం కార్మిక శాఖ భవన నిర్మాణదారుల నుంచి 1 శాతం పన్ను వసూలు చేస్తోంది.