అమరావతి: డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలకు పెద్దఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది మార్చి లోపు 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.61,964 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వారు కోరుకున్న రంగాల్లో శిక్షణ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్, పశుసంపద, సెరికల్చర్ తదితర రంగాల్లో రుణాలు ఇవ్వనుంది.
డ్రోన్ల వినియోగం, మినీ రైస్ మిల్స్, తృణధాన్యాల సాగు, దాని ఆధారిత పరిశ్రమలు, సేంద్రియ వ్యవసాయంపై మహిళలను ప్రోత్సహించనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంఘాల నుంచి 1.25 లక్షల మంది విద్యావంతులైన సభ్యులను ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేసి లోన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. వీరికి ఆర్థిక వ్యవహారాలు, డిజిటల్ లిటరసీపై స్పెషల్ ట్రైనింగ్ అందించనున్నారు. కాగా గతంలో స్వయం ఉపాధి సంఘాలు తీసుకున్న రుణాలను ప్రామాణికంగా తీసుకొని అధికారులు రుణ ప్రణాళికను తయారు చేస్తున్నారు.