Andhrapradesh: విద్యారంగ సంక్షేమ పథకాల నుంచి జగన్ పేరు తొలగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరడజను సంక్షేమ పథకాలకు నూతన నామకరణం చేసింది,
By అంజి Published on 29 July 2024 4:30 PM ISTAndhrapradesh: విద్యారంగ సంక్షేమ పథకాల నుంచి జగన్ పేరు తొలగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరడజను సంక్షేమ పథకాలకు నూతన నామకరణం చేసింది, వాటిలో కొన్నింటికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును తొలగించి విద్య కోసం ఉద్యమించిన నాటి దిగ్గజాల పేర్లు పెట్టారు. కొత్త నామకరణంలో భాగంగా.. పిల్లలను చదివించే తల్లులకు ఆర్థిక సహాయం అందించే 'జగనన్న అమ్మ ఒడి' పథకం పేరును 'తల్లికి వందనం'గా మార్చారు.
అలాగే స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇతర మెటీరియల్‌తో కూడిన ఎడ్యుకేషన్ కిట్‌లను అందించే 'జగనన్న విద్యా కానుక' పేరును 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర'గా మార్చినట్లు ప్రభుత్వం విడుదల చేసింది. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం 'జగనన్న గోరుముద్ద'ను 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం'గా మార్చారు.
పాఠశాల పునరుద్ధరణ పథకం 'మన బడి నాడు నేడు'ను.. 'మన బడి మన భవిష్యత్తు'గా పేరు మార్చారు. విద్యార్థినులకు ఉచితంగా అందజేసే శానిటరీ న్యాప్‌కిన్‌ల పంపిణీ కార్యక్రమం 'స్వేచ్ఛ' పేరును 'బాలికా రక్ష'గా మార్చారు.
పరీక్షల్లో ప్రథమస్థానంలో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆర్థికంగా ప్రోత్సహించే 'జగనన్న ఆణిముత్యాలు' పథకానికి 'అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం'గా నామకరణం చేశారు.
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు.
విద్యాసంస్థలను రాజకీయాల నుంచి విముక్తి చేసి విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దడమే మా సంకల్పం’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్న లోకేశ్, గత వైఎస్సార్‌సీపీ హయాంలోని పథకాలకు ప్రభుత్వం పేరు మార్చిందన్నారు.