రైతులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్, రబీ పంట ఉత్పత్తుల కొనుగోలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 9 March 2024 1:06 AM GMTరైతులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్, రబీ పంట ఉత్పత్తుల కొనుగోలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రబీ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత నెలలో శనగలు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే.. ఇప్పుడు మినుము, పెసలు, వేరుశనగ సేకరణకు కూడా జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్బీకేల ద్వారా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది.
రబీ 2023-24 సీజన్‌లో ఏడు లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 ఎకరాల్లో పెసలు, 1.61 ఎకరాల్లో వేరు శనగ పంటలను రైతులు సాగు చేశారు. శనగ 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84వేల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. మద్దతు ధర కింద క్వింటాల్ శనగకు రూ.5,400, పెసలుకి రూ8,558, మినుముకి రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది. కాగా.. ఈ-క్రాప్ ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. దళారుల నుంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా బయోమెట్రిక్‌ను తప్పని సరి చేస్తున్నారు.
ఇక మార్కెట్‌లో శనగలు, మినుము, పెసలు, వేరుశనగ సేకరిస్తున్నారు. అక్కడ కనీస మద్దతు ధర దక్కని రైతులు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే.. మార్కెట్‌లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనీ.. రైతులు తొందరపడి పంట ఉత్పత్తులను ఎమ్మెస్పీ ధర కంటే తక్కువకు అమ్ముకోవద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.