అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీ గడువుపై ప్రకటన చేసింది. పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.
2024 - 25కు గాను ప్రజలు చెల్లించాల్సిన పన్నుపై ఈ రాయితీ వర్తిస్తుంది. మార్చి నెలాఖరుతోనే గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మార్చి నెలాఖరులో వరుస సెలవుల వల్ల రాయితీ ఉపయోగించుకోలేకపోయామని విజ్ఞప్తులు రావడంతో పొడిగించింది. ఇదిలా ఉంటే.. పన్ను ఆదాయం ప్రజల అవసరాలకే ఉపయోగించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పన్నుల ఆదాయంతో.. నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.