ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కారుణ్య నియామకాలకు అనుమతి
AP Government allowed compassionate appointments.కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
By తోట వంశీ కుమార్ Published on 19 Jan 2022 4:21 AM GMTకరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రెండో వేవ్‌లో చాలా కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అప్పట్లో వారందరికీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య నియామకాలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారణ్య నియామకాలను వర్తింపచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
అయితే.. ఈ కారుణ్య నియామకాల వర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వనుంది. సామాజిక భద్రత కల్పన చర్యగా మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి హోదాతో పోస్టు ఇవ్వనున్నారు. జూన్ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో భాగంగా.. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి.. కొందరిని గ్రామ/వార్డు సచివాలయాల్లో నియమించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కాగా.. ప్రభుత్వ నిర్ణయంపై బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా తమను రోడ్డున పడేసినా.. ముఖ్యమంత్రి జగన్ పెద్ద మనసుతో తమని ఆదుకున్నారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.