మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడంతో టీడీపీ నేతల్లో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా వచ్చేసింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై సెటైర్లు వేశారు. చంద్రబాబు హడావుడి చూస్తుంటే నవ్వొస్తోందని, గవర్నర్ ను కలవడం ఒక్కటే తక్కువ అన్నట్టుందని అన్నారు. రాజీనామా చేయాలని మమ్మల్ని అంటున్నారని, చంద్రబాబే రాజీనామా చేయొచ్చని అన్నారు. 175 స్థానాల్లో పోటీ పెట్టే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తీరు సరికాదని, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని సజ్జల ఆరోపించారు. కొందరు అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని, ఒక్క బండిల్ చూస్తేనే ఆరు ఓట్లు తేడాగా కనిపించాయని, అన్ని బండిల్స్ పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. వైసీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారని, రీకౌంటింగ్ కోరడం అభ్యర్థి హక్కు అని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్తేంకాదని.. అర్జంటుగా అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు తహతహలాడుతున్నారని అన్నారు.