పోరస్ అగ్నిప్రమాదంపై స్పందించిన గవర్నర్
AP Governer Respond on Eluru Fire Accident.ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో
By తోట వంశీ కుమార్ Published on 14 April 2022 6:23 AM GMTఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. కాగా.. ఈ ఘటనపై గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
తాత్కాలికంగా మూసివేస్తున్నాం: కలెక్టర్
ఘటనాస్థలాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాత్కాలికంగా పోరస్ కంపెనీని మూసివేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? ప్రమాదకర రసాయనాల వినియోగం ఏమైనా ఉందా..? అనే అంశాలపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నంత కాలం కంపెనీనే వేతనం అందిస్తుందన్నారు.
కారకులపై చర్యలు తీసుకోవాలి : చంద్రబాబు
ఈ ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిశ్రమలో రియాక్టర్ పేలి ప్రాణ నష్టం సంభవించడం విచారకమన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడాలని కోరారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణకు యాజమాన్యాలు రాజీ పడొద్దదని సూచించారు. నిత్యం ప్రభుత్వం పరిశ్రమల్లో తనిఖీలు చేయాలన్నారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.