సీపీఎస్ రద్దుపై 'సంధి' ప్రయత్నాలు?

AP employees demand scrapping CP scheme. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్).. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మూడేళ్లుగా ఇబ్బంది పెడుతున్న అంశం.

By సునీల్  Published on  12 Sep 2022 11:02 AM GMT
సీపీఎస్ రద్దుపై సంధి ప్రయత్నాలు?

ఉద్యోగ సంఘాలను ఒప్పించేలా చర్చించనున్న ప్రభుత్వ పెద్దలు

రంగంలోకి సీనియర్లు.. అందుకే మిలియన్ మార్చ్ వాయిదా!

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్).. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మూడేళ్లుగా ఇబ్బంది పెడుతున్న అంశం. సీఎం జగన్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటితో మేనిఫెస్టోను రూపొందించారు. మూడేళ్లలో వాటిలో దాదాపు 98.5 శాతం హామీలను అమలు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. అయితే అదే సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు అంశం మాత్రం ప్రభుత్వానికి కొరుకుపడని కొయ్యగా ఇరుకున పెడుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌పై సర్దుబాటు ధోరణి కోసం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో పీఆర్సీ ప్రకటించిన సమయంలోనూ ఉద్యోగ, ఉపాధ్యాయులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. వేలాది మంది ఉద్యోగులు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు మీద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంతకు ముందు ధర్నా చౌక్‌లో ఆందోళనలు, కలెక్టరేట్ల ముట్టడి, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. అనంతరం ప్రభుత్వం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లోనూ తమ వాణిని బలంగా వినిపించారు. ఇదే సమయంలో కొన్ని సంఘాలు ప్రభుత్వం సూచించిన సవరణలకు అంగీకరించడంతో ఆ ఉద్యమం చల్లారింది. అదే తరహాలో ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపైనా తలొగ్గారు.

పీఆర్సీ ఉద్యమం తరహాలోనే సీపీఎస్ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా నిర్వహించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సీపీఎస్‌పై ఇప్పటికే రెండేళ్లుగా అనేక రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చిన సెప్టెంబర్ రెండో తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల వైఖరిని గుర్తించిన ప్రభుత్వం ఒక రోజు ముందుగానే జేఎస్ఎస్ సమావేశం నిర్వహించి, వాయిదా పడేలా చేసింది. అనంతరం సెప్టెంబర్ 11న నిర్వహిస్తామని ప్రకటించినా పలు కారణాలతో మళ్లీ పోస్ట్ పోన్ చేశారు.

ఒకవైపు ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతుంటే ప్రభుత్వం దాన్ని ఎలాగైనా నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తోంది. పీఆర్సీ అయినా, సీపీఎస్ అయినా ఉపాధ్యాయులే కీలకంగా వ్యవహరిస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఉద్యమం చేపడతామన్న రోజుల్లో ఎవరికీ సెలవులు ఇవ్వరాదని, తప్పనిసరిగా హాజరు కావాలని నిబంధనలు విధించింది. అలాగే ఉపాధ్యాయుల సొంత ఫోన్లలో ఫేషియల్ అటెండెన్స్ వేసే విషయంలోనూ తలొగ్గేలా చేసింది. సీపీఎస్ విషయంలోనూ అదే విధంగా చేయాలని పావులు కదుపుతోంది. అందుకోసం సీనియర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

సీపీఎస్‌పై ఉద్యమాన్ని నీరుగార్చి, జీపీఎస్‌కు ఆమోదం తెలిపేలా చేసేందుకు ఉద్యోగ సంఘాల్లోని కొన్ని వర్గాలను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జీపీఎస్‌కు అనుకూలంగా వైఖరి తీసుకునేలా ప్రభుత్వం చేయగలిగింది. సీపీఎస్‌ను రద్దు చేయలేనప్పుడు మెరుగైన గ్యారంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్) తీసుకోవడం మంచిదనే అభిప్రాయానికి పలు సంఘాలు వచ్చాయి. ఈ క్రమంలోనే మిగిలిన కీలక సంఘాలనూ ఒప్పించేలా 'సంధి' ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు సీనియర్ మంత్రులు కూడా నిరంతరం చర్చలు జరుపుతున్నారు. కనుక సీపీఎస్‌పై అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్వహించే జేఎస్ఎస్ సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది.


Next Story