ఈ ఏడాది ఏపీలో క్రైమ్‌ రేటు తగ్గింది: డీజీపీ రాజేంద్రనాథ్

AP DGP reveals crime data, says crime rate decreased in the state in 2022. అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

By అంజి  Published on  28 Dec 2022 8:53 AM GMT
ఈ ఏడాది ఏపీలో క్రైమ్‌ రేటు తగ్గింది: డీజీపీ రాజేంద్రనాథ్

అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది పెండింగ్‌ కేసుల సంఖ్య చాలా వరకు తగ్గిందని, లోక్‌ అదాలత్‌లో 57 వేల కేసులను పరిష్కరించామని స్పష్టం చేశారు. ఈ ఏడాది శిక్షా శాతాన్ని పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేశామని డీజీపీ తెలిపారు. నేరారోపణల శాతం 66.2 శాతం పెరిగిందని, మహిళలపై అత్యాచారం, హత్య కేసుల్లో 44 మందికి శిక్ష పడిందని డీజీపీ తెలిపారు.

88.5 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయని చెప్పారు. 2021 కంటే 2022లో 60 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయని, 169 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు. 2021లో 2,84,753 కేసులు నమోదయ్యాయని, 2022లో 2,31,359కి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. మహిళా పోలీసుల వల్ల గ్రామాల్లో నేరాలకు పాల్పడే వారి వివరాలు ముందుగానే తెలుస్తున్నాయని చెప్పారు. హత్యలు 945 నుంచి 857కి తగ్గాయని.. అయితే రాష్ట్రంలో దొంగతనాలు కొంత పెరిగాయని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఏడాదికాలంగా సైబర్‌ నేరాలు పెరిగాయని డీజీపీ రాజేంధ్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 2700 సైబర్‌ క్రైం కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. పోలీసు అధికారులకు సైబర్‌ నేరాలను అదుపులో ఉంచడానికి నాలుగు చోట్ల రీజినల్‌ సైబర్‌ సెంటర్స్‌ పెట్టి శిక్షణ ఇస్తామని తెలిపారు.

Next Story