ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు ఇచ్చారు. రఘుపతి రాజీనామాను స్పీకర్ తమ్మినేని ఆమోదించారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మరో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే ఛాన్స్ ఉంది. సామాజిక సమీకరణాల కారణంగానే కోన రఘుపతి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రఘుపతిని రాజీనామా చేయాల్సిందిగా సీఎం జగన్ కోరినట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఆ సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు.
అదే సమయంలో కొన్ని పదవుల్లో సీఎం జగన్ మార్పులు చేయాలనుకున్నారు. అంతే తడవుగా ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణును, ప్రభుత్వ చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డిని తొలగించి ప్రసాదరాజును నియమించారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ సమయంలో వెల్లంపల్లి శ్రీనివాసరావును మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సామాజికవర్గానికి చెందిన మరెవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే మంత్రి పదవి ఆశించిన కోలగట్ల వీరభద్ర స్వామికి ఈ పదవి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఇందు కోసమే కోన రఘుపతితో రాజీనామా చేయించినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి మూడున్నరేళ్ల వరకూ ఉన్నారు. వచ్చే ఏడాదిన్నర వరకూ ఆ పదవిలో కోలగట్ల వీరభద్రస్వామి ఉండే అవకాశం ఉంది. కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక అయితే.. స్పీకర్.. డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉత్తారంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉంటారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఉన్నారు.