తిరుమల: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా కొణిదెల సోమవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన ఏడేళ్ల కుమారుడు మార్క్ శంకర్ కాలిన గాయాలకు గురైనప్పుడు తాను తీసుకున్న ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి ఆమె శ్రీవారికి తన తలనీలాలను సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిబంధనల ప్రకారం.. రష్యన్ క్రైస్తవురాలైన అన్నా లెజ్నెవా, గాయత్రి సదన్‌లో ఆలయ అధికారుల సమక్షంలో వెంకటేశ్వరునిపై తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ డిక్లరేషన్ ఫారమ్‌లపై సంతకం చేసింది.
శ్రీవారికి కృతజ్ఞతా చిహ్నంగా అన్నా తన తలనీలాలను అర్పించింది. "సంప్రదాయానికి అనుగుణంగా, అన్నా పద్మావతి కల్యాణ కట్ట వద్ద తన జుట్టును అర్పించి, ఆచారాలలో పాల్గొంది" అని జనసేన పార్టీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
పవన్, అన్నా లెజ్నెవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ఏప్రిల్ 8న సింగపూర్‌లో స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు అయ్యాయి. అతని ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. విషయం తెలుసుకుని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత, అతన్ని తిరిగి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.