ఆడపిల్లల భద్రతపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తమ ప్రభుత్వం ఆడ పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
By అంజి Published on 2 July 2024 11:15 AM GMTఆడపిల్లల భద్రతపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి: తమ ప్రభుత్వం ఆడ పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్‌కు గురైన భీమవరం బాలిక ఆచూకీని పోలీసులు రెండు రోజుల్లో కనుగొన్నారని తెలిపారు. ఆ అమ్మాయి జమ్మూలో ఉన్నట్టు తాజాగా తమ ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ప్రభుత్వం అనుకుంటే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్న పవన్.. అమ్మాయిలు అదృశ్యమైతే గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని అన్నారు.
గత అయిదేళ్లలో ఎంత మంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదన్నారు. బాలికల అదృశ్యం కేసులపై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆడపిల్లల అదృశ్యంపైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలైతే తప్ప ఇది తీవ్రరూపం దాల్చదని అన్నారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓ అమ్మాయి అదృశ్యమై 24 గంటలు గడిస్తే, ఆ అమ్మాయి దొరకడం చాలా కష్టమని, ఆ అమ్మాయి సంగతి ఇక మర్చిపోవడమేన పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక, 48 గంటలు గడిస్తే ఆ అమ్మాయిని ఎటు తీసుకెళతారో తెలియదని అన్నారు. అప్పుడప్పుడు పోలీసులు కూడా నిస్సహాయంగా మారిపోతుంటారని వివరించారు.